: 9న ప్రధాని మోదీతో మమత బెనర్జీ భేటీ... ఏప్రిల్ లో బంగ్లాదేశ్ పర్యటనకు ఇద్దరూ?


వారిద్దరూ భిన్న ధృవాలు. బద్ధ శత్రువులు. రాజకీయంగా కత్తులు దూసుకున్నారు. కలిసి భేటీల్లో పాలుపంచుకునేందుకు ససేమిరా అన్నారు. నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి మమతా బెనర్జీ ఆయనతో భేటీ కాలేదు. మొన్నటి నీతి ఆయోగ్ తొలి భేటీకి కూడా వారి మధ్య ఉన్న వైరి కారణంగానే మమత డుమ్మా కొట్టేశారు. అయితే అదంతా నిన్నటిదాకా ఉన్న పరిస్థితి. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం హోదాలో మమతా బెనర్జీ, ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ రాశారు. ‘‘మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. బంగ్లాదేశ్ తో నీటి వాటాలున్న తీస్థా నది సమస్య పరిష్కారానికి కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ అందులో ఆమె ప్రధాని మోదీకి తెలిపారు. వెనువెంటనే పీఎంఓ నుంచి మమతకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో ఈ నెల 9న జరగనున్న సదరు భేటీకి మంత్రులు, ఎంపీలతో పాటు అధికారులను కలుపుకుని మొత్తం 40 మందిని వెంటేసుకుని ప్రధాని వద్దకు వెళ్లనున్నట్లు మమత వెల్లడించారు. ఇక మమత లేఖతో మరింత చొరవ చూపిన మోదీ, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏప్రిల్ లో మమతతో కలిసి పర్యటనకు వస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే... ఇక కేంద్రం, పశ్చిమ బెంగాల్ ల మధ్య స్నేహం మొగ్గ తొడిగినట్టేనన్నమాట.

  • Loading...

More Telugu News