: 'అత్యంత సంపన్న భారతీయుడు'గా మళ్లీ ముకేశ్ అంబానీయే
'అత్యంత సంపన్న భారతీయుడు'గా ఫోర్బ్స్ పత్రిక జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. వరుసగా ఈ జాబితాలో ఎనిమిదవసారి ఈ దిగ్గజ పారిశ్రామిక వేత్తకు తొలిస్థానం లభించడం విశేషం. 2015కు గాను 90 మంది భారతీయులతో కూడిన ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. అందులో 2,100 కోట్ల డాలర్ల నికర సంపద విలువతో ముకేశ్ అగ్రస్థానంలో నిలిచారు. తరువాతి ద్వితీయ, తృతీయ స్థానాల్లో దిలీప్ సంఘ్వీ (2000 కోట్ల డాలర్లు), అజీమ్ ప్రేమ్ జీ (1910 కోట్ల డాలర్లు) ఉన్నారు అంతర్జాతీయంగా చూస్తే బిల్ గేట్స్ గతేడాది కంటే ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద విలువ 7,920 కోట్ల డాలర్లు. గత 21 ఏళ్లలో గేట్స్ కు ప్రథమ స్థానం రావడం ఇది 16వ సారి కావడం విశేషం. కార్లోస్ స్లిమ్ (మెక్సికో), వారెన్ బఫెట్ (అమెరికా)లకు రెండు, మూడు స్థానాలు లభించాయి. ఇదే జాబితాలో ముకేశ్ కు 39వ స్థానం, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమ్జీలకు వరుసగా 44, 48 ర్యాంకులు దక్కాయి. వ్యక్తులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో ఉన్న వాటాలు, స్థిరాస్తులు, విలాసవంత పడవలు, పెయింటింగ్ లు, నగదు తదితర ఆస్తులను పరిగణనలోకి తీసుకొని 29వ వార్షిక ధనవంతుల జాబితాను రూపొందించినట్టు ఫోర్బ్స్ తెలిపింది.