: మరోసారి చంద్రబాబు స్కూలుకే వచ్చారు... పీహెచ్ డీ ఎక్కడ గంటా?: విశాఖ జిల్లా టీడీపీ నేత
విశాఖపట్టణం జిల్లా టీడీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా కొనసాగుతోంది. తనకు పార్టీలు మారే అలవాటు లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానిస్తే, తాను చంద్రబాబు స్కూల్ నుంచి వచ్చానని ఎప్పుడు ఏం చెయ్యాలో తనకు తెలుసని, తానంటే గిట్టని వారే తనపై వ్యాఖ్యలు చేస్తారని మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిచ్చారు. వీరి వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెడుతుండగా, వారు చేసుకుంటున్న విమర్శలు ఆపార్టీ నేతల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. దీంతో జిల్లా టీడీపీ నేత రామానాయుడు మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడిపై పూటకోపార్టీ మారే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. చంద్రబాబు స్కూల్ నుంచి బయటపడిన గంటా, ఇంటర్ చిరంజీవి కళాశాలలో పూర్తి చేశారని అన్నారు. డిగ్రీ కోసం కిరణ్ కుమార్ రెడ్డి గూట్లో ఉన్నారని, పీజీ చేసేందుకు మరోసారి చంద్రబాబు స్కూల్ కే వచ్చేశారని అన్నారు. ఇప్పుడు మిగిలింది పీహెచ్ డీ యేనని, అదెక్కడ చేస్తారో ఆయనకే తెలియాలని రామానాయుడు ఎద్దేవా చేశారు. గంటాలా అయ్యన్నపాత్రుడుకి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, అవకాశవాద రాజకీయాలు తెలియవని అన్నారు.