: ఆసేతు హిమాచలం అకాల వర్షం!
భారతావని అకాల వర్షానికి తడిసి ముద్దయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. శీతాకాలం వెళ్లి వేసవి వచ్చే ప్రస్తుత సీజన్లో ఇటువంటి వర్షాలు రావడం చాలా అరుదని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానించారు. నేడు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని తెలిపారు. ఈ వానలు పర్యావరణ మార్పులకు సంకేతాలని వివరించారు. నిన్న కాన్పూర్, కత్రా, భావనగర్ తదితర ప్రాంతాల్లో 40 మి.మీ, ఢిల్లీ, రత్నగిరి తదితర ప్రాంతాల్లో 30 మి.మీ వర్షపాతం నమోదైంది. అహ్మదాబాద్, లక్నో, ముంబై, బెంగుళూరు, హైదరాబాదులలో ఓ మోస్తరు వర్షం పడింది. ఉత్తర భారతావని నుంచి వచ్చిన శీతల పవనాలకు అరేబియా సముద్రం నుంచి వచ్చిన గాలులు తోడు కావడంతో దేశవ్యాప్తంగా వర్ష మేఘాలు విస్తరించాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని పేర్కొన్నారు.