: గూగుల్ టాక్ సేవలు నిలిపివేత... వాటి స్థానంలో హ్యాంగ్ అవుట్స్
జీ టాక్ (ఇన్ స్టంట్ మెసేజ్ సర్వీస్) సేవలను సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నిలిపివేసింది. తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న దీని స్ధానంలో హ్యాంగ్ అవుట్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ మయూర్ కామత్ తొలిసారి ఈ విషయాన్ని తన బ్లాగ్ స్పాట్ ద్వారా తెలిపారు. జీ టాక్ సేవలు అధికారికంగా రద్దయినప్పటికీ జిట్సి, పీఎస్ఐ, ఇన్ స్టెంట్ బర్డ్, మిరండా ఐఎమ్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చట. అయితే, దాంతో గూగుల్ కు ఏమాత్రం సంబంధం ఉండదట. ఇక, హ్యాంగ్ అవుట్స్ గురించి చెప్పుకుంటే... గూగుల్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అందులో ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా గ్రూప్ లోని సభ్యుల మధ్య వాయిస్, వీడియో కాల్స్ ఉచితం. దానిలో ఒక్కసారే వంద మందితో గ్రూప్ చాట్ చేయవచ్చట.