: శ్రీవారి సన్నిధిలో... కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఏపీ మంత్రి గంటా


ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మీడియాతో గంటా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. రైల్వే బడ్జెట్ లోనే కాకుండా, సాధారణ బడ్జెట్ లో కూడా ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంతో తోడ్పాటు ఉంటుందని ఆశించామని... కానీ, కేంద్రం చాలా అన్యాయం చేసిందని వాపోయారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని, రాష్ట్రానికి న్యాయం జరగలేదని సీఎం తన బాధను వ్యక్తీకరించారని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన పోలవరానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయిస్తే, అది ఎన్నేళ్లకు పూర్తవుతుందో ఆలోచించుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ, ఢిల్లీని మించిన కేపిటల్ సిటీని నిర్మిస్తామని హామీ ఇచ్చారని... కానీ, బడ్జెట్లో రాజధానికి సంబంధించిన అంశం కూడా లేదని గంటా ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు పునర్విభజన చట్టంలోని ఎన్నో అంశాలపై మాట్లాడారని... ఇప్పుడు మాత్రం మొండి చేయి చూపారని విమర్శించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారని, రాష్ట్రానికి రావాల్సిన అన్నింటి గురించి ప్రధానితో చర్చిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News