: ఆ చట్టాలు అమలైతే... సింగపూర్, అమెరికా, బ్రిటన్ల సరసన భారత్!
నల్లధనం నిరోధానికి కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన అంశాలు చట్టాలుగా రూపొందితే... అమెరికా, సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల సరసన భారత్ సగర్వంగా చోటు దక్కించుకోనుంది. నల్లధనం నిరోధానికి ఆ దేశాల్లోనే కఠిన చట్టాలు అమలువుతున్నాయి. మొన్నటి బడ్జెట్ లో అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రతిపాదనలు చట్టాలుగా రూపొందితే, ఆ దేశాల కంటే కూడా భారత్ లోనే కఠిన చట్టాలు అమలైనట్లవుతుంది. పన్ను ఎగవేత కేసులకు సంబంధించి అమెరికాలో ఏడాది జైలు శిక్షతో పాటు లక్ష డాలర్ల మేర జరిమానా అమలవుతోంది. అయితే జైట్లీ ప్రతిపాదనల ప్రకారం, భారత్ లో పన్ను ఎగవేతకు పదేళ్ల జైలు శిక్ష పడనుంది. అంటే, నల్లధనం నిరోధానికి మనమే కఠిన చర్యలు అమలు చేయనున్నామన్నమాట. ఈ అంశమే దేశీయ పారిశ్రామికవేత్తలను బెంబేలెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రతిపాదనలను అంత తొందరగా అమలు చేయొద్దని అసోచామ్ కేంద్రాన్ని కోరుతోంది. ఎప్పటికైనా ఈ అంశాలు చట్టాలుగా మారడం ఖాయమేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెబుతున్నారు.