: నేడు తుళ్లూరుకు పవన్ కల్యాణ్ ... రాజధాని రైతులతో సమావేశం
జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నేడు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం తుళ్లూరులో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములను సేకరిస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై పలువురు రైతులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ చెబితేనే చంద్రబాబుకు ఓటేశామని చెబుతున్న ఆ ప్రాంత రైతులు, సర్కారు చేతిలో అన్యాయానికి గురవుతున్న తమను పవన్ కల్యాణే కాపాడాలని గళమెత్తారు. ఈ నేపథ్యంలో నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతుల సమస్యలు కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నేడు తుళ్లూరు వెళ్లనున్న పవన్ కల్యాణ్, అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. చంద్రబాబుతో భేటీ మరునాడే పవన్ కల్యాణ్ తుళ్లూరు బాట పట్టడం గమనార్హం.