: సినిమా చరిత్రను కబ్జా చేశారు: దాసరి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ లో వివాదాస్పద అంశాలపై తనదైనశైలిలో విమర్శలు చేసే దర్శకరత్న దాసరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా చరిత్రను కొంతమంది కబ్జా చేశారని వ్యాఖ్యానించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సినిమా చరిత్రను తారుమారు చేసేసి, వాస్తవాలకు సమాధికట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాస్తవ చరిత్రను రాసేందుకు మహారచయితల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులోని నాయుడును తొలగించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి అవార్డుల్లో కులం పేరు అడ్డం రాలేదన్న ఆయన, రఘుపతి వెంకయ్య నాయుడుకు ఎలా కులం అడ్డం వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. దర్శకులు అవాంఛనీయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. హీరోల బాడీ లాంగ్వేజ్ ను బట్టి కథలు తయారు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మంచి కథలను రాస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన చెప్పారు.