: ముత్యాలు పొదిగిన గౌను కొట్టేశాడు... నిజం తెలిసి తిరిగిచ్చేశాడు!
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు విశ్వవ్యాప్తంగా ఉన్న నటులు నెలల తరబడి కసరత్తు చేస్తారు. ఏ డ్రెస్సు వేసుకోవాలి, ఎలాంటి చెప్పులేసుకోవాలన్న విషయాలపై తర్జనభర్జన పడతారు. హాలీవుడ్ నటి లుపితా నాంగో కూడా అలాగే చేశారు. 6 వేల ముత్యాలు పొదిగిన గౌనును ఆమె ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అయితే లుపితా డ్రెస్ పై ఓ దొంగ కన్ను పడింది. ఇంకేముంది, లండన్ లోని వెస్ట్ హాలీవుడ్ హోటల్ నుంచి సదరు గౌనును ఆ దొంగ బుధవారం గుట్టు చప్పుడు కాకుండా తస్కరించేశాడు. అయితే, రెండు రోజులకే అసలు విషయం తెలుసుకుని సదరు గౌనును అదే హోటల్ లో అప్పగించేశాడు. ఇంతకూ అతడు తెలుసుకున్న నిజమేంటంటే, గౌనులో పొదిగిన ముత్యాలు నకిలీవట. గౌనును తస్కరించిన దొంగ, 1.5 లక్షల డాలర్ల విలువ చేస్తాయనుకున్న ముత్యాలను గౌను నుంచి వేరు చేసి విక్రయించే యత్నం చేశాడట. లాస్ ఏంజెలిస్ లోని వజ్రాల వ్యాపారులు సదరు ముత్యాలు నకిలీవని తేల్చారట. దీంతో నిరాశతో అతడు సదరు గౌనును ఎక్కడైతే తస్కరించాడో, అక్కడే అప్పగించేశాడట.