: రూ.2 లక్షల ప్రమాద బీమా... నెలకు ప్రీమియం రూపాయే
దేశంలో చాలామందికి ఎటువంటి ఆరోగ్యం, ప్రమాద, జీవిత బీమా లేదని, పింఛన్లు కూడా రావట్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలో 'ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన' పథకాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దానికింద ఏడాదికి రూ.12 ప్రీమియంతో అంటే నెలకు రూపాయి ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రీమియం కట్టినవారు ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తారు. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని, అందులో భాగంగానే పింఛను సదుపాయం కూడా ఇస్తామని జైట్లీ చెప్పారు. ప్రతినెలా ఈ ఖాతాలో పేదలు ఎంత ఆదా చేస్తే అందులో సగం మళ్లీ ప్రభుత్వం కూడా కలుపుతుందని వివరించారు. 60 ఏళ్లు దాటినప్పటినుంచీ వారికి పింఛను వర్తిస్తుందన్నారు. అలాగే 18-50 ఏళ్ల మధ్య వారికి ఏడాదికి రూ.335 ప్రీమియంతో మరో ప్రమాద బీమా కల్పిస్తామన్నారు.