: పాపం విండీస్ కెప్టెన్... డివిలీర్స్ వీరవిహారానికి బిత్తరపోయాడు!
సౌతాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ వెస్టిండీస్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దీంతో, ప్రతి బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకోక తప్పలేదు. తనకు బంతే ప్రత్యర్ధి అయినట్టు, ఎన్నాళ్లుగానో దాచుకున్న కసిని తీర్చుకున్నట్టు ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు ఏబీ. తద్వారా, తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ కు అత్యంత చెత్త రికార్డును అంటగట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తొలి ఓవర్ ను మెయిడెన్ గా పూర్తి చేసిన హోల్డర్, ఆ తర్వాత డివిలీర్స్ వీరవిహారం చేయడంతో చేష్టలుడిగిపోయాడు. మొత్తమ్మీద ఆధునిక ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా రికార్డు పుటలకెక్కాడు. తన కోటా పది ఓవర్లలో 104 పరుగులు సమర్పించుకున్న ఏకైక బౌలర్ గా నిలిచాడు. 48వ ఓవర్లో రెండు నోబాల్స్ సహా 8 బంతులు సంధించిన హోల్డర్ 4,6, 2, 4, 4, 4, 2, 6 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో 2, 6, 6, 4, 6, 6 పరుగులు ఇచ్చేశాడు. అత్యంత చెత్త బౌలర్ రికార్డు మొదట న్యూజిలాండ్ బౌలర్ స్నెడెన్ పేరిట ఉండేది. 1983తో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన స్నెడెన్ 105 పరుగులిచ్చుకున్నాడు. అప్పట్లో వన్డే అంటే 60 ఓవర్లు, బౌలర్ కోటా 12 ఓవర్లు. ఈ నేపఝథ్యంలో, 50 ఓవర్ల వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా జాసన్ హోల్డర్ రికార్డు పుటలకెక్కాడు.