: మార్చి 1న జరగనున్న పీజీమెట్-2015కు ఏర్పాట్లు పూర్తి: వీసీ రవిరాజు
మార్చి 1న తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న పీజీమెట్-2015కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి రవిరాజు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, మార్చి 1న జరగనున్న ఈ పరీక్షకు 13,442 మంది హాజరుకానున్నారని అన్నారు. ఆన్ లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షను 44 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9.15 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని ఆయన చెప్పారు. మార్చి 1న ప్రాథమిక కీ విడుదల చేస్తామని చెప్పిన ఆయన, మార్చి 2 సాయంత్రం వరకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. మార్చి 7న తుది కీ, ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.