: గంటలోగా చెత్త డబ్బాలు తొలగించండి... జీహెచ్ఎంసీకి హైకోర్టు మొట్టికాయలు
ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న మార్గంపై హైకోర్టు అక్షింతలు వేసింది. పన్ను వసూళ్ల కోసం ఇళ్లు, కార్యాలయాల ముందు చెత్త డబ్బాలు పెట్టడం ద్వారా పన్ను బకాయిదారులను జీహెచ్ఎంసీ దారిలోకి తెచ్చుకోవాలని యత్నించింది. ఈ యత్నం మొదట్లో మంచి ఫలితాలనే ఇచ్చినా, ఆ తర్వాత బెడిసికొట్టింది. చెత్త డబ్బాలు చూసి బకాయిలు వసూలవుతాయనుకున్న జీహెచ్ఎంసీ అధికారులపై బకాయిదారులు కోర్టుకెక్కారు. ఈ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం విచారించిన హైకోర్టు, జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటలోగా బకాయిదారుల ఇళ్లముందు పెట్టిన చెత్త డబ్బాలను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక పన్ను వసూళ్ల కోసం ప్రత్యామ్నాయ మార్గాలుండగా, ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారని నిలదీసింది. హైకోర్టు మొట్టికాయలతో రంగంలోకి దిగిన అధికారులు చెత్త డబ్బాలను తొలగించే పనిని ప్రారంభించారు.