: మోదీ కొనసాగితే గడ్డుకాలమే... ఆమ్నెస్టీ ఆందోళన
భారత ప్రధానిగా మోదీ కొనసాగితే భారత్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇండియాలో జాతి వైరాలు పెరిగాయని, ఇక ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న భూసేకరణ చట్ట సవరణ బిల్లు ద్వారా దేశంలో చాలామంది ప్రజలు, ముఖ్యంగా రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారని ఆ సంస్థ అంచనా వేసింది. మే 2014లో సాధారణ ఎన్నికల తరువాత వివిధ కార్పొరేట్ ప్రాజెక్టుల నేపథ్యంలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపిన ఆమ్నెస్టీ, ఆ ప్రాజెక్టు నిర్మించే క్రమంలో అక్కడి వారిని సంప్రదించకుండా ఉండటం వల్లనే వివాదాలు పెరుగుతున్నాయని అంచనా వేసింది. ప్రజలు వర్గాలుగా విడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిరమైన, సురక్షితమైన పాలనను, మెరుగైన వసతులు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన మోదీ, ఆ తరువాత కార్పొరేట్ సంస్థలకు తలొగ్గేలా పనిచేస్తున్నారని విమర్శించింది.