: భార్యను కప్ బోర్డులో దాచిన పాక్ లెజెండరీ స్పిన్నర్!
విదేశాల్లో సిరీస్ లు ఆడేటప్పుడు భార్యలు, స్నేహితురాళ్లు వెంట ఉంటే ప్రోత్సాహకరంగా ఉంటుందని క్రికెటర్లు భావిస్తుంటారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లాయిన్ ముస్తాక్ కూడా అలాంటివాడే. 1999 వరల్డ్ కప్ లో ఆడేందుకు పాక్ జట్టు బ్రిటన్ వెళ్లింది. టోర్నీలో కొన్ని మ్యాచ్ లకు వరకు క్రికెటర్ల వెంట వారి భార్యలు, స్నేహితురాళ్లు ఉండేందుకు అనుమతించిన పాక్ జట్టు మేనేజ్ మెంట్ సెమీఫైనల్ దశ నుంచి ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. క్రికెటర్ల వెంట ఎవరూ ఉండరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. భార్య సనా సాహచర్యాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్న సక్లాయిన్ కు ఈ నిర్ణయం రుచించలేదు. కానీ, మేనేజ్ మెంట్ ఆదేశాలను బహిరంగంగా వ్యతిరేకించలేని పరిస్థితి! చివరకు, భార్యను వెంటే ఉంచుకోవాలని, అయితే, ఇతరులకు తెలియనివ్వకూడదని అనుకున్నాడు. జట్టు బస చేసే హోటళ్ల వివరాలు ఆమెకు అందజేసేవాడట. సక్లాయిన్ కన్నా ఆమె ముందే అక్కడకు వెళ్లేదట. ఇక కోచ్, మేనేజర్ తనను పిలిచేందుకు వస్తే... భార్యను కప్ బోర్డులో దాక్కోమని చెప్పేవాడట. ఓ క్రికెట్ వెబ్ సైట్ తో ఈ సంగతులు పంచుకున్నాడు సక్లాయిన్.