: కృష్ణా జిల్లాలో ఓఎన్‌జీసీ 'గ్యాస్ లీకేజీ' కలకలం
ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ పైప్ లైన్ లో లీకేజీ మరోసారి చిచ్చు రేపింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని చిన్నపాండ్రాక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని పంట పొలాలపై గ్యాస్, క్రూడ్ ఆయిల్ పెద్ద మొత్తంలో ఎగిసిపడుతోంది. దీంతో రైతులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మంటలు చెలరేగితే నష్టం భారీగా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పంట నష్టం వివరాలు నమోదు చేసుకుని నష్టపరిహారం ఇప్పించే దిశగా కృషిచేస్తామని కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. దీనిపై ఓఎన్జీసీ అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. తాజా లీకుతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.