: కథ విన్నప్పుడే ఎన్టీఆర్ ఎక్కడ? అని అడిగా: ప్రకాశ్ రాజ్
'గోవిందుడు అందరి వాడేలే' సినిమా షూటింగ్ లో ఉండగా పూరీ జగన్నాధ్ టెంపర్ కథ ఉందని చెప్పాడని ప్రకాశ్ రాజ్ తెలిపారు. హైదరాబాదులో జరిగిన టెంపర్ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, కథ విన్నప్పుడే తాను ఎన్టీఆర్ ఎక్కడ? అని అడిగానని తెలిపారు. వెంటనే పూరీ, రచయిత వంశీ, తారక్ తో కలిసి బయటికి వెళ్లానని ఆయన చెప్పారు. జీవితం అనేది సాగుతూ ఉండాలని, గెలుపు ఓటములు సహజమని ఆయన చెప్పారు. తారక్, పూరీల్లో నైపుణ్యమున్నప్పటికీ వారిలో విజయం సాధించలేకపోతున్నామే అనే బాధ కనిపించిందని ఆయన అన్నారు. వారిద్దరూ వారిపైనున్న నమ్మకం కోల్పోకుండా నిజాయతీగా ప్రయత్నించారని అన్నారు. అందుకే టెంపర్ ఇంత పెద్ద విజయం సాధించిందని ఆయన చెప్పారు. పూరీ జగన్నాథ్ కు సినిమా అంటే ప్రాణం అని ఆయన అన్నారు. సూపర్ స్టార్ అయి ఉండి అవసరం లేని కథలను ఎంతకాలం ఇలా మోస్తావు? అని తారక్ ను అడిగే వాడినని ఆయన చెప్పారు. ఆయనలో ఎంతో నటనా చాతుర్యం ఉందని, విభిన్నమైన కథలను చేయాలని సూచించారు. ఇన్నాళ్టికి ఎన్టీఆర్ విజయం సాధించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపాడు.