: సగటు భారతీయుని కోరికలివి!
సరిగ్గా మరో వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుకు బడ్జెట్ తో రానున్న నేపథ్యంలో పరిశ్రమల సమాఖ్య అసోచామ్ ఒక సర్వే నిర్వహించి సగటు ఇండియన్ ఈ బడ్జెట్టులో ఏమి కోరుతున్నదో వివరించింది. ఈ సర్వే ప్రకారం అత్యధికుల కోరిక పన్ను పరిధుల విస్తరణే. ప్రస్తుతం సాలీనా రూ.2.5 లక్షలు సంపాదిస్తున్న వారికి ఎటువంటి పన్ను చెల్లింపులూ అవసరం లేదు. దీన్ని కనీసం రూ.3 లక్షలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ.5 వేలు, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ.10 వేలు మిగులుతాయి. ఇక ప్రజలు కోరుతున్న రెండో కోరిక గృహ రుణాలపై వడ్డీ రాయితీ పరిమితుల సడలింపు. ప్రస్తుతం రూ.2 లక్షల లోపు గృహ రుణం తీసుకుంటే అమలు చేస్తున్న వడ్డీ రాయితీలను రూ.5 లక్షల వరకూ పెంచితే గృహరుణాలు చెల్లిస్తున్న వారిలో 78 శాతం మందికి లబ్ధి కలుగుతుంది. దీంతోపాటు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద లభించే రాయితీల పరిధిని కూడా పెంచాలని అత్యధికులు కోరుతున్నారు. ప్రస్తుతం సాలీనా రూ.1.5 లక్షల వరకూ ఫిక్సెడ్ డిపాజిట్లు, జాతీయ పొదుపు ఖాతాలు, పీఎఫ్ నిధుల్లో పెట్టుబడి పెట్టి వాటిపై పన్ను రాయితీలు పొందుతున్న వారు ఈ పరిమితిని మరింతగా పెంచాలని కోరారు. అంతేకాదు, బంగారం దిగుమతిపై సుంకాలను తగ్గించాలని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది కోరారు. వేతన ఉద్యోగుల్లో 82 శాతం మంది పెన్షన్ ప్రణాళికల్లో విడిగా రూ.50 వేల పెట్టుబడులకు రాయితీలు కోరుతున్నారు. కాగా, ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 55 శాతం మంది 25 నుంచి 29 సంవత్సరాల లోపు వయసు వారేనని అసోచామ్ వెల్లడించింది.