: మోదీ ‘మన్ కీ బాత్’ లో 10 సెకన్ల యాడ్ విలువ రూ.2 లక్షలట!


ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)కు భారీ ఆదాయాన్నే సమకూర్చిపెడుతోంది. రేపు ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే రూ.25 లక్షల మేర ఆదాయం వచ్చి చేరిందని ఏఐఆర్ వర్గాలు చెబుతున్నాయి. దేశ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏఐఆర్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. మన్ కీ బాత్ (మనసులో మాట) పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని దేశంలో మెజారిటీ ప్రజలు వింటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి వాణిజ్య ప్రకటనల సేకరణకు అటు కేంద్రంతో పాటు ఇటు ఏఐఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని యాడ్స్ విభాగం చెబుతోంది. సాధారణంగా పది సెకన్ల యాడ్ కు ఏఐఆర్... సమయం, కార్యక్రమాన్ని బట్టి రూ. 500 నుంచి రూ.1,500 వసూలు చేస్తోంది. అయితే మన్ కీ బాత్ కు ముందు, వెనుకా ప్రసారం చేసే ప్రకటనల కోసం పలు సంస్థలు క్యూ కడుతున్నాయి. దీంతో ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసారం చేసే యాడ్ విలువ ఒక్కసారి రూ.2 లక్షలకు (పది సెకన్లకు) పెరిగిపోయింది. రేపటి మన్ కీ బాత్ సందర్భంగా ఈ తరహా యాడ్ కోసం గ్లాక్సో స్మిత్ క్లైన్ యాడ్ స్లాట్ ను బుక్ చేసుకుంది. ఆ సంస్థ ఉత్పత్తి హార్లిక్స్ ప్రకటన రేపటి మన్ కీ బాత్ సందర్భంగా వినిపించనుంది.

  • Loading...

More Telugu News