: పాక్ పై వెస్టిండీస్ ఘన విజయం... 160 పరుగులకే చాప చుట్టేసిన పాక్ బ్యాట్స్ మెన్
వరల్డ్ కప్ టైటిల్ వేటలో అగ్రశ్రేణి జట్లతో పాటు పసికూనలు కూడా మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తుంటే, ఒకప్పటి విజేత పాకిస్థాన్ మాత్రం పేలవ ప్రదర్శనతో పాక్ క్రీడాభిమానులను ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. నేటి ఉదయం వెస్టిండీస్ తో ముగిసిన మ్యాచ్ లో లక్ష్యసాధనలో పాక్ చతికిలబడింది. ప్రత్యర్థి జట్టు స్కోరులో సగం పరుగులకే పాక్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరారు. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు సమర్పించుకున్న పాక్ జట్టు, సింగిల్ పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమికి బాటలు వేసుకుంది. ఉమర్ అక్మల్ (50), సోహైబ్ మక్సూద్ (50)లు విజయం కోసం చేసిన పోరుకు సహచరుల నుంచి లేశమాత్రం సహకారం కూడా లభించలేదు. దీంతో కరీబియన్లు, పాక్ పై 150 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. దీంతో మెగాటోర్నీలో పాక్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. వెస్టిండీస్ బౌలర్లు జెరోమ్ టేలర్, ఆండీ రస్సెల్ లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఆండీ రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.