: రిలయన్స్, అడాగ్, ఎస్సార్ ఆయిల్, కెయిర్న్ ఇండియా... కార్పొరేట్ గూఢచర్యంలో చమురు దిగ్గజాలు... పలువురి అరెస్ట్
చమురు మంత్రిత్వ శాఖలో కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారం మరింతగా విస్తరిస్తోంది. ఈ కేసు తీవ్రత మరింతగా ఉండవచ్చని అంచనా. ఇప్పటివరకూ, చమురు మంత్రిత్వశాఖ పత్రాల దొంగతనం వరకే పరిమితం అనుకుంటుండగా, అది ఆర్థిక, బొగ్గు, విద్యుత్తు మంత్రిత్వ శాఖలకూ పాకింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. వచ్చే వారంలో ఆర్థికమంత్రి చేయబోయే బడ్జెట్ ప్రసంగంలోని సమాచారాన్ని నిందితులు తస్కరించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చమురురంగంలో దిగ్గజ కంపెనీలుగా పేరున్న ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయన సోదరుడు అనిల్ అంబానీ నడుపుతున్న అడాగ్, ఎస్సార్ ఆయిల్, కెయిర్న్ ఇండియా కంపెనీల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని గురువారం నాడు, ఏడుగురిని నిన్న అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో శైలేష్ సక్సేనా (కార్పొరేట్ వ్యవహారాల మేనేజర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్), వినయ్‌కుమార్ (డీజీఎం, ఎస్సార్), కె.కె.నాయక్ (జీఎం, కెయిర్న్ ఇండియా), సుభాష్ చంద్ర (సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూబ్లియంట్ ఎనర్జీ), రిషీ ఆనంద్ (డీజీఎం, అడాగ్ రిలయన్స్), శంతను సైకియా (కన్సల్టెంట్), ప్రయాస్ జైన్ (కన్సల్టెంట్) లు ఉన్నారు. ఈ కేసు ఎన్ని సంచలనాలను వెలుగులోకి తెస్తుందో వేచి చూడాలి.