: ‘టైమ్స్’ బాయ్... ‘రాకెట్’ ఎక్కేశాడు: ఈ- కామర్స్ సంస్థ ఉద్యోగిగా ఎంపిక
'టైమ్స్ ఆఫ్ ఇండియా' దిన పత్రిక పేపర్ బాయ్ గా పనిచేస్తూ ఐఐఎం-కోల్ కతా లో సీటు సాధించి రెండేళ్ల క్రితం అందరి దృష్టిని ఆకట్టుకున్న ఎన్.శివకుమార్ తాజాగా మరోమారు వార్తల్లోకెక్కాడు. అతడిలోని నైపుణ్యాలను ఇట్టే పసిగట్టిన జర్మనీ ఈ-కామర్స్ కంపెనీ ‘రాకెట్ ఇంటర్నెట్’ అతడికి ఉద్యోగాన్నిచ్చేసింది. అది కూడా సాదాసీదా హోదా కాదండోయ్, డిప్యూటీ కంట్రీ హెడ్ గా అతడిని నియమించుకుంది. ఇప్పుడిప్పుడే కార్యరంగంలోకి దూకిన సదరు సంస్థలాంటి కొత్త కంపెనీల్లో పనిచేసేందుకు తనకు అత్యంత ఇష్టమని శివకుమార్ చెప్పాడు. ఇంకా కేంపస్ ఇంటర్వ్యూలే పూర్తిగా ప్రారంభం కాలేదు, అప్పుడే రాకెట్ ఇంటర్నెట్, శివకుమార్ లోని నైపుణ్యాన్ని పసిగట్టింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగించిన ఇంటర్వ్యూలో తొలి 15 నిమిషాలు అతడి కుటుంబ నేపథ్యం గురించి ప్రశ్నలు సంధించిన రాకెట్ ఇంటర్నెట్ యాజమాన్యం, ఇక ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలన్నింటినీ అతడి ఆసక్తికర జీవితం తెలుసుకునేందుకే వేసిందట.