: మెక్ కల్లమ్ వీర విహారం... హ్యాట్రిక్ విజయం దిశగా కివీస్!
ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వీర విహారం చేస్తున్నాడు. వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా నేటి ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పై కివీస్ బౌలర్ టిమ్ సౌతీ మెరుపు దాడి చేశాడు. తొమ్మిది ఓవర్లలో ఏడు వికెట్లు తీసిన అతడు, ఇంగ్లండ్ బ్యాటింగును కుప్పకూల్చాడు. దీంతో 33.2 ఓవర్లలోనే 123 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. ఆ తర్వాత 124 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఆరు ఓవర్లలోనే 96 పరుగులు సాధించింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, ఆరు సిక్స్ లతో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన అతడు 21 బంతుల్లోనే 72 పరుగులు రాబట్టాడు. విజయం ఖరారైన కివీస్ మోగా టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేయనుంది.