: నాలుగు రోజుల ముందు రామానాయుడుగారు చాలా యాక్టివ్ గా ఉన్నారు: నటుడు రాజశేఖర్
ఓ డాక్టర్ గా నిర్మాత రామానాయుడుగారికి తాను మూడు నెలల నుంచి ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు నటుడు రాజశేఖర్ తెలిపారు. ఈ మూడు నెలల్లో ఆయనకు తాను ఎంతో దగ్గరయ్యానని చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కొత్త ఉత్సాహం వచ్చేదని, ఆ వెంటనే స్టూడియో ఎలా ఉంది? అక్కడ షూటింగ్ జరుగుతుందా? ఓ సారి వెళ్లి రావాలని తాపత్రయపడేవారని రాజశేఖర్ మీడియా ఎదుట గుర్తు చేసుకున్నారు. అలా నాలుగైదు రోజుల ముందు ఆయన చిన్న కొడుకు వెంకటేష్ ఇంటికి, నానక్ రామ్ గూడ స్టూడియోకి, అలాగే రామానాయుడు స్టూడియోకి ఒక్కరోజే మూడు చోట్లకు వెళ్లొచ్చారని వివరించారు. అయినప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నారన్నారు. తిరిగొచ్చాక కూడా తాను (రామానాయుడు) నరసాపూర్ లో కట్టించిన ఓల్డేజ్ హోమ్ ను కూడా ఓసారి వెళ్లి చూసి రావాలని చాలా ఆరాటపడ్డారని తెలిపారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రామానాయుడు బాధ్యత, పనులు, లక్ష్యం వీటి గురించే ఆలోచించే వారని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. పూర్తి జీవితాన్ని అనుభవించిన వ్యక్తని, వారి కుటుంబసభ్యులకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని తాను కోరుకుంటున్నానన్నారు.