: మోదీ ‘సూట్’పై వివాదం... కోడ్ ఆఫ్ కండక్ట్ ను మోదీ అతిక్రమించారా?
ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బంద్ గలా సూటు ఆయనను అప్రతిష్ఠపాల్జేసేలానే ఉంది. ఇప్పటికే రూ.10 లక్షల విలువ చేసే ఈ సూటు ధరించిన ఆయనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నిన్నటికి నిన్న వేలానికి వచ్చిన సదరు సూటు మరోమారు మోదీ ఆడంబరాన్ని ప్రజలముందుంచింది. తాజాగా సదరు సూటు మోదీని మరింత దిగజార్చే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. అత్యంత విలువైన సూటును బహుమతిగా స్వీకరించి మోదీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని వర్గాలు. కేంద్ర కేబినెట్ తో పాటు రాష్ట్రాల కేబినెట్ లలో సభ్యులుగా ఉన్నవారెవరూ తమ సమీప బందువుల నుంచి తప్ప మిగతా వ్యక్తుల నుంచి బహుమతులు స్వీకరించడానికి వీలు లేదు. అయితే మోదీకి సదరు సూటును బహుమతిగా అందించిన గుజరాతీ వ్యాపారవేత్త రమేశ్ కుమార్ భికాభాయ్, ప్రధానికి బంధువు కాదు. ఈ నేపథ్యంలో భికాభాయ్ నుంచి విలువైన బహుమతిని స్వీకరించిన మోదీ, ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్టేనన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. సూటు వేలం పూర్తయ్యేలోగానే ఈ విషయంపై విపక్షాలు రాద్ధాంతం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.