: తెలుగు ప్రజల మనసుల్లో రామానాయుడు చిరస్థాయిగా నిలిచిపోతారు: వెంకయ్యనాయుడు
ప్రఖ్యాత నిర్మాత రామానాయుడు హఠాన్మరణం పట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఆయన మరణవార్త విని ఎంతో విచారించానని చెప్పారు. జీవితంలో క్రమశిక్షణ, అంకిత భావం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని నిరూపించిన మనిషి ఆయనని పేర్కొన్నారు. ఏ పనినైనా ఆచరించి చూపిన మహోన్నత మనిషి అని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఆయన తీసినన్ని చిత్రాలు ఎవరూ తీయలేదని చెప్పారు. ఎందరో తారలను చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని, తెలుగు ప్రజల మనసుల్లో రామానాయుడు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తమ గ్రామంలో రామానాయుడు ఆడిటోరియం నిర్మించారని చెప్పిన వెంకయ్య, ఆయన కుటుంబంతో తనకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించారు.