: తమిళ నటుడు విజయకాంత్ కు జరిమానా విధించిన కోర్టు
పరువునష్టం దావా కేసుల్లో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కు మద్రాసు హైకోర్టు రూ.24 వేలు జరిమానా విధించింది. అధికార అన్నాడీఎంకే నేతలపై తీవ్ర విమర్శలు చేసినందుకు విజయకాంత్ పై పలు జిల్లాల్లో పరువునష్టం దావా కేసులు నమోదయ్యాయి. ఈ కోర్టుల విచారణలు డీఎండీకే వర్గాలకు చమటలు పట్టిస్తున్నాయి. వారెంట్లు వస్తుండటంతో విసిగిన విజయకాంత్, ఆయన పార్టీ నేతలు కేసుల విచారణ ఆపాలని కోరుతూ, హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ జరుగుతుండగానే, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా దాఖలు చేయడం, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం జరిగింది. తామూ సుప్రీంకు వెళ్తామని డీఎండీకే వర్గాలు కోరగా, ఈ మేరకు హైకోర్టు అంగీకరించింది. కాగా, నెలరోజుల సమయం ఇచ్చినా వారు స్టే తేవడంలో నిర్లక్ష్యం చూపడంతో, కోర్టు ఈ జరిమానాను విధించింది.