: ధోనీ ఆనందానికి అంపైర్ అడ్డుతగిలాడు!


పాకిస్థాన్ జట్టుపై వరల్డ్ కప్ లో నెగ్గడం టీమిండియా ఆటగాళ్లకు ఓ మధురానుభూతి. ఆదివారం అడిలైడ్ లో దాయాదిని చిత్తుచేసిన తర్వాత విజయానందం భారత ఆటగాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఇక, మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన జట్టు ఆటగాళ్లు గుర్తుగా స్టంపులను పీకి తమతో తీసుకెళ్లడం తెలిసిందే. ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ ధోనీ ముందుంటాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే ఓ వికెట్ పీకి జాగ్రత్త చేసుకుంటాడు. పాకిస్థాన్ తో తాజా వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ అలా చేసేందుకు యత్నించాడు. అయితే, అంపైర్ ఇయాన్ గౌల్డ్ అడ్డుతగిలాడు. అందుకు బలమైన కారణమే ఉందండోయ్. ఈసారి వరల్డ్ కప్ లో ఎల్ఈడీ స్టంపులను వినియోగించారు. వాటిపై బెయిల్స్ కూడా ఎల్ఈడీ సహితమే. వాటికి బంతి తగలగానే వెలుగుతూ ఆరిపోతూ వీక్షకులను అలరిస్తాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువే. ఓ సెట్ ఎల్ఈడీ స్టంపుల ఖరీదు రూ.24 లక్షలు కాగా, రెండు ఎల్ఈడీ బెయిల్స్ రూ.50 వేలు విలువ చేస్తాయట. వాటిని మ్యాచ్ కు గుర్తుగా తీసుకెళ్లాలంటే ఐసీసీ అనుమతి తప్పనిసరి. అందుకే, అంపైర్ ఇయాన్ గౌల్డ్ అడ్డు చెప్పాడు. ధోనీ బెయిల్ తీసేందుకు యత్నించగా, అంపైర్ వచ్చి ఏదో మాట్లాడడం టీవీల్లో కనిపించింది. అనంతరం ఆ బెయిల్ ను ధోనీ యథాస్థానంలో ఉంచేశాడు.

  • Loading...

More Telugu News