: రేటింగ్ కోసం అసత్యాలు, అబద్ధాలు... మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం) అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వకపోవడంతో, న్యూఢిల్లీ పోలీసులు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలపై శశిథరూర్ తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం తనపై కట్టుకథలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన, తాను విచారణకు సహకరించడం లేదంటూ వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. అసత్యాలను ప్రసారం చేసే మీడియా స్థానంలో నిజాయతీగా వ్యవహరించే జర్నలిజం ఇండియాకు చాలా అవసరం అంటూ, నేడు శశిథరూర్ ట్వీట్ చేశారు. 'నిజాలను ప్రతిబింబించని మీడియా' అని అర్థం వచ్చేలా ప్లకార్డును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, సునంద కేసులో సిట్ ఇప్పటికే ఆయనను రెండుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.