: ఓడలు బండ్లవడం అంటే ఇదే..


పర్వేజ్ ముషారఫ్.. ఒకప్పుడు పాకిస్తాన్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న సైనిక నియంత. నేడు, ఆయనే పాక్ చట్టాల గుప్పిట్లో బందీ అయ్యారు. రక్తం బొట్టు చిందకుండా అధికారాన్ని సైనిక విప్లవంతో హస్తగతం చేసుకున్న ఈ జనరల్ .. ఇప్పుడు భవిష్యత్ ఏమిటో తెలియని అనిశ్చితిలో కూరుకుపోయాడు. తీవ్రవాదంతో అట్టుడుకుతున్న దేశాన్ని ఉద్ధరిస్తానంటూ స్వీయ బహిష్కరణను రద్దు చేసుకుని ఆఘమేఘాలపై పాక్ లో అడుగిడిన ఈ మాజీ అధ్యక్షుడికి తగిన శాస్తే జరిగిందన్నది ఆయన వ్యతిరేక వర్గాల మాట.

ముషారఫ్ బద్దవైరులు ఈ మాట అనడం వెనకున్న నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. పాక్ లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత నాలుగున్నరేళ్ళుగా లండన్, దుబాయ్‌లలో ఆశ్రయం పొందిన ముషారఫ్.. అధ్యక్ష పదవి మరోసారి అందిపుచ్చుకునేందుకంటూ స్వదేశం చేరాడు. వచ్చీరావడంతోనే తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ శ్రేణులన్నింటిని సమాయత్తపరిచి ఎన్నికలకు సమరశంఖం పూరించాడు. తానొకటి తలిస్తే.. మరొకటి జరిగిందన్నట్టు పాత కేసులు ఆయన్ను కబళించేందుకు నోరు తెరుచుకుని ఉన్న సంగతి ఆదమరిచాడు. ఫలితం నేడు అరెస్టయ్యాడు.

60 మంది న్యాయమూర్తులను ఏకపక్షంగా తొలగించిన కేసులో ముషారఫ్ ను అరెస్ట్ చేయాలంటూ నిన్న కోర్టు ఆదేశించడంతో అక్కణ్ణించి చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. ఇస్లామాబాద్ శివారులోని తన ఫాంహౌస్ లో నక్కిన ముషారఫ్ ను నేడు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. దీనికి తోడు ఆయన నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడీ మాజీ సైనిక జనరల్. అధికారంలో ఉన్నప్పుడు ఎందరి భవిష్యత్తునో శాసించిన ఈ మాజీ సైనిక జనరల్ నేడు తన భవిష్యత్తును అంధకారంలో పడేసుకున్నాడు. ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో..!.

  • Loading...

More Telugu News