: ఢిల్లీలో భాజపా గెలిస్తే బాగుండేది... మనసులో మాట చెప్పిన చంద్రబాబు
సుస్థిరత, అభివృద్ధి కోసం ఢిల్లీలో బీజేపీ గెలవాల్సిందని తెదేపా నేతలతో జరిపిన భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పలువురు తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు బాబుతో సమావేశం అయినప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. "భాజపా ఓడిపోవడం మంచిదైందని ప్రజలంటున్నారు సార్! దీనిపై అంతా సంతోషంగా ఉన్నారు. ప్రధాని ఇకపై మరింత ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు" అని కొందరు వ్యాఖ్యానించగా, బాబు దాన్ని ఖండించారు. ఢిల్లీ ఫలితాన్ని ఆ కోణంలో చూడకూడదని, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధికి అవకాశమున్న దేశంగా ఇండియాను చూస్తున్న సమయంలో, పెట్టుబడుల కోసం చూస్తే, భాజపానే గెలిచి ఉండాల్సిందని తన మనసులో మాట చెప్పారట.