: తెలంగాణలో బాబు పర్యటిస్తున్నాడనే దుగ్ధతోనే వివాదం: యరపతినేని శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న కుడికాల్వను తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఎలా నిర్వహిస్తారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో పర్యటించారన్న దుగ్ధతోనే వివాదం రేపుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో బాబు పర్యటనను అడ్డుకుందామని చూసిన టీఆర్ఎస్ నేతలు, అది సాధ్యం కాకపోవడంతో, రాజకీయ ప్రయోజనాల కోసం జలవివాదాన్ని రేపుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలం పుంజుకోవడం తట్టుకోలేక టీఆర్ఎస్ నేతలు నాగార్జున సాగర్ వివాదం పేరిట విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులు ఎందుకు ఇబ్బంది పడాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయని ఆయన నిలదీశారు. రండి చర్చిద్దాం, సమస్యను పరిష్కరిద్దామని ఆయన పిలుపునిచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని కుడి కాల్వను తెలంగాణ అధికారులు నిర్వహించడంలో హేతుబద్దత ఎంత? అని ఆయన ప్రశ్నించారు.