: మదనపల్లిలో అదృశ్యమైన పూజారి దంపతులు రాయచూర్ లో తేలారు!
చిత్తూరు జిల్లా మదనపల్లిలో పది రోజుల క్రితం అదృశ్యమైన పూజారి శివస్వామి, ఆయన భార్య సురక్షితంగానే ఉన్నారట. కర్ణాటకలోని రాయచూరులో పూజారి దంపతులను పోలీసులు గుర్తించారు. మదనపల్లిలోని సాయిబాబా ఆలయంలో పనిచేస్తున్న శివస్వామి, సాయిబాబా ప్రతిమతో కలిసి సెల్ఫీ తీసుకున్నారట. ఈ క్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాలక మండలిలోని కొంతమంది సభ్యులు శివస్వామిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఓ లేఖ రాసి, దానిని ఫేస్ బుక్ లో పెట్టిన శివస్వామి, భార్యతో పాటు అదృశ్యమయ్యాడు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, శివస్వామి దంపతులు రాయచూర్ లో ఉన్నట్టు గుర్తించారు.