: అనని మాటలు అన్నానంటూ ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు
విదేశాల్లో ఉండి పాలిస్తున్నానంటూ అనని మాటలను అనినట్టు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసింది టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పర్యటన సందర్బంగా హన్మకొండలో ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన తెలంగాణలో సంస్కరణలు ప్రవేశపెట్టింది టీడీపీ అని అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచీ టీడీపీ సంస్కరణలు అమలు చేస్తూ వస్తోందని అన్నారు. తెలంగాణకు తాగు, సాగు నీటి కోసం బాబ్లీ పోరాటం చేసిందని తానేనని ఆయన గుర్తు చేశారు. తనపై విమర్శలు చేస్తున్న నేతలు తెలంగాణ ప్రజల కోసం ఏం చేశారో అవలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు. చౌకబారు విమర్శలకు పాల్పడుతూ, ప్రజల్లో విద్వేషాలు రేపుతున్నారని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల కోసం తాను పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు తెలుగు ప్రజలంతా ఒకటేనని, ఆంధ్రప్రదేశ్ లో కూడా తానేనాడూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. తన చిత్తశుద్ధేమిటో అక్కడే తెలిసిపోతుందని ఆయన వెల్లడించారు. విద్యుత్ సమస్యకు కారణం చంద్రబాబు అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారమే తాను వెళ్తున్నానని, చట్టాన్ని అతిక్రమించి కోర్టులతో చివాట్లు తినడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యుత్ సమస్య కోసం కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్ ను కలిశానని ఆయన చెప్పారు. దీనిని ఆయన కూడా ప్రస్తావించిన విషయం బాబు గుర్తు చేశారు. నేతలు పార్టీలు మారారు కానీ, కార్యకర్తలు ఏనాడూ పార్టీని వీడలేదని, అందుకు తాను రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. తెలుగు తమ్ముళ్ల ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని ఆయన పేర్కొన్నారు. గతంలో తనకు చాలా అడ్డంకులు సృష్టించిన నేతలు ఏమయ్యారో అందరికీ తెలిసిందేనని చెప్పిన ఆయన, తాజాగా తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే రెండు రాష్ట్రాల సమస్యలపై తాను మాట్లాడానని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలను కలిసేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. తాను రావడంతో చాలా మంది భయపడ్డారని, అందుకు సాక్ష్యాలు తెలుగు తమ్ముళ్లకు తెలుసని ఆయన వివరించారు. కాగా, టీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్ ఆందోళనలతో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడినప్పటికీ బాబు సభ విజయవంతమైంది.