: టీడీపీ వేదికకు నిప్పు పెట్టింది మేమే... చంద్రబాబు వచ్చేలోగా విధ్వంసం: ఎమ్మార్పీఎస్
వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటైన టీడీపీ వేదికకు నిప్పు పెట్టింది తామేనని ఎమ్మార్సీఎస్ ప్రకటించింది. అంతేకాక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వరంగల్ చేరుకునే లోగా విధ్వంసం సృష్టిస్తామని కూడా సదరు ఉద్యమ సంస్థ ప్రతినిధులు హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితం వరంగల్ లోని టీడీపీ జిల్లా కార్యాలయంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు యత్నించారు. వీరిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్సీఎస్ కార్యకర్తల దాడిలో కార్యాలయంలోని ఫ్లెక్సీలు, కటౌట్లు కాలి బూడిదయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేత మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ వరంగల్ లో అడుగుపెట్టేలోగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తామని ఆయన హెచ్చరించారు.