: వరంగల్ బయలుదేరిన చంద్రబాబు... బాబు వెంట భారీ కాన్వాయ్
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం వరంగల్ బయలుదేరారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో కూడిన భారీ కాన్వాయ్ తో చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరారు. నగరంలోని రసూల్ పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు వరంగల్ కు పయనమయ్యారు. ఇదిలా ఉంటే, చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చేశారు. అంతేకాక తెలంగాణకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాలన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పర్యటనను అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వరంగల్ పర్యటనలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.