: బస్సులో వరంగల్ కు వెళ్లనున్న బాబు... అడ్డుకునేందుకు రోడ్లపైకి చేరిన టీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో వరంగల్ కు బస్సులో బయలుదేరనున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఉప్పల్ నుంచి వరంగల్ వరకూ ప్రతి ఊరిలో టీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రోడ్లపైకి చేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర విభజన, ఎన్నికల తర్వాత తెలంగాణ జిల్లాల్లో బాబు తొలిసారి అడుగు పెడుతుండగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, తెలంగాణకు నీరివ్వకుండా చంద్రబాబు అన్యాయం చేశాడంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బాబును వరంగల్ కు రానివ్వబోమని తేల్చిచెబుతూ, పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో 'ఏం జరుగుతుందో?' అని పోలీసులు సైతం ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఆయన పర్యటనపై టీఆర్ఎస్ మంత్రులు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో, బాబును అడ్డుకునేందుకు ప్రభుత్వం పరోక్ష మద్దతు ఇస్తోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.