: మోదీకి గుడి కట్టించిన అభిమానగణం... రెండు పూటలా ప్రత్యేక పూజలు
సినీనటులపై అభిమానంతో వారికి అభిమానులు గుడులు కట్టించడం విన్నాం, చూశాం. అదేబాటలో రాజకీయాల్లోనూ నేతలకు ప్రజలు గుడులు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన అభిమానులు గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలో ఉన్న కతారియా గ్రామంలో ఓ మందిరాన్ని నిర్మించారు. అందులో మోదీ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడికి వచ్చి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గుడిని నిర్మించేందుకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టిందని దీనిని కట్టించిన వ్యక్తి రమేష్ ఉన్ దాడ్ తెలిపారు. విగ్రహం తయారు చేసేందుకు లక్షా 65వేల రూపాయల ఖర్చయిందని వెల్లడించారు. ప్రధాని విగ్రహం కోసం మూడు నాలుగేళ్లు వివిధ శిల్పులను సంప్రదించామని, అయినా ఎవరూ అచ్చం మోదీలా ఉండే విగ్రహాన్ని తయారు చేయలేకపోయారన్నారు. చివరికి ఒడిశా నుంచి శిల్పులను రప్పించి విగ్రహాన్ని తయారు చేయించామని వివరించారు. ఈ నెల 15న మోదీ మందిరాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.