: ఐఎస్ఐఎస్ కు ఇంటర్నెట్ ఆకాశరామన్న సవాలు
ఐఎస్ఐఎస్ కు ఇంటర్నెట్ ఆకాశరామన్న సవాలు విసురుతున్నాడు. వ్యక్తులను పట్టుకుని చంపడమే జీహాద్ అంటూ, టెర్రరిజానికి కొత్త భాష్యం చెబుతున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థపై అంతర్జాల ఆకాశరామన్న బృందం (అనానిమస్ గ్రూప్)యుద్ధం ప్రకటించింది. ఐఎస్ఐఎస్ పట్ల యువత ఆకర్షితమవుతుండడం పట్ల దిగ్భ్రాంతి చెందినట్టు కనిపిస్తున్న అనానిమస్ హ్యాకర్ల గ్రూప్, ఐఎస్ఐఎస్ నెట్ వర్క్ ను ఛిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సామాజిక వెబ్ సైట్లలో ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కలిగి ఉన్న ఖాతాలను వెతికి పట్టుకుని వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు అలాంటి 800 ట్విట్టర్ ఖాతాలను, 12 ఫేస్ బుక్ పేజీలను, 50 ఈ మెయిల్ అడ్రస్ లను గల్లంతు చేసినట్టు ఆ అనానిమస్ హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. తీవ్రవాద సంస్థలతో సామాజిక నెట్ వర్క్ లో సంబంధాలు కలిగిన వారికి ఈ గ్రూప్ హెచ్చరిక పంపింది. 'మిమ్మల్ని ఓ వైరస్ లా చూస్తాం, ఆ వైరస్ ను మేము పెకలించగలం. ఎందుకంటే ఇంటర్నెట్ మా చేతుల్లో ఉంది' అని ఐఎస్ఐఎస్ సంస్థకి యూట్యూబ్ ద్వారా ఓ టెక్స్ట్ మెసేజ్ పంపింది. మిలియన్ల సంఖ్యలో ఖాతాదారులను కలిగిన ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోని సభ్యుల స్పందనలపై ప్రతిక్షణం కన్నేసి ఉంచడం సాధ్యం కావడం లేదని ఆ సంస్థలు పేర్కొన్న నేపథ్యంలో అనానిమస్ హ్యాకింగ్ గ్రూప్ సామాజిక బాధ్యతగా ఈ పని చేయడం హర్షణీయం. కాగా, ప్రభుత్వ విభాగాలు, కంపెనీల వెబ్ సైట్లను హ్యాక్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన ఆ హ్యాకర్ల బృందం, జనవరి 12న చార్లీహెబ్డో పత్రికపై బహిరంగ దాడికి దిగినప్పటి నుంచి ఐఎస్ఐఎస్ పై యుద్ధం ప్రకటించారు.