: ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం అసంతృప్తి... భూసేకరణకు అదనపు గడువు ఇచ్చే ఆలోచన
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా 30,000 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు ఈ భూసేకరణలో ఇప్పటివరకు కేవలం 12,000 ఎకరాలను మాత్రమే సేకరించారు. వాస్తవానికి ఈ నెల 15కల్లా సీఆర్ డీఏ అధికారులు మొత్తం భూమి సేకరించాల్సి ఉంది. కానీ వారు లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మిగతా 18,000 ఎకరాల భూమి సేకరణకు గడువు పెంచాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం మరో నాలుగు రోజుల సమయాన్ని అధికారులకు ఇవ్వనుందని ప్రభుత్వ అధికారుల సమాచారం. ఇదిలా ఉంటే తుళ్లూరు, నేలపాడు, అనంతవరం, సఖ్మూరు గ్రామాల రైతులు మాత్రమే రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. నదీ ముఖ గ్రామాలైన రాయపూడి, ఉండవల్లి, పెనమాకు, తాడేపల్లి రైతులు పలు కారణాల వల్ల భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిసింది.