: హైదరాబాదులోని కార్మిక నగర్, సింగరేణి కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు... 51 మంది అరెస్ట్
హైదరాబాదులోని సంపన్నుల ఆవాసం జూబ్లీ హిల్స్ సమీపంలోని కార్మిక నగర్ లో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సైదాబాదు పరిధిలోని సింగరేణి కాలనీలో ఇదే తరహా సోదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కార్మిక నగర్, సింగరేణి కాలనీల్లోకి ప్రవేశించిన పోలీసులు ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు. ఈ సందర్భంగా కార్మికనగర్ లో 33 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సింగరేణి కాలనీలో 18 మందిని అరెస్ట్ చేశారు. ఇక సింగరేణి కాలనీలో పెద్ద ఎత్తున నాటు సారా లభించిందని పోలీసులు చెబుతున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు కూడా ఈ సోదాల్లో బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.