: ప్రారంభమైన ఢిల్లీ ఓట్ల లెక్కింపు... దేశవ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన జనం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. నేటి మధ్యాహ్నం 12 గంటల్లోగా పూర్తి కానున్న కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 7న జరిగిన పోలింగ్ లో 70 నియోజకవర్గాల్లో 673 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించినా... ఆప్, బీజేపీల మధ్యే ప్రధాన పోరు నెలకొంది. ఆప్ తరఫున ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు బరిలోకి దిగగా, ఆయనకు పోటీగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని బీజేపీ రంగంలోకి దించింది. ఇరువురు నేతలు నిజాయతీ కలిగిన అధికారులుగా పేరుగాంచిన నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై కూర్చునేదెవరన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీంతో దేశ ప్రజల్లో మెజారిటీ మంది టీవీలకు అతుక్కుపోయారు. ఇక ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని జాతీయ, ప్రాంతీయ వార్తా ఛానెళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారాలతో పాటు విశ్లేషణలను ప్రసారం చేస్తున్నాయి.