: ఇంత పేలవ బౌలింగా?... పెదవి విరిచిన గవాస్కర్
సన్నాహక మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోటీలో ఉదారంగా పరుగులు సమర్పించిన బౌలర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, బౌలర్ల ప్రదర్శనపై దృష్టిని సారించాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ళపై ఏ మాత్రం ప్రభావం చూపని విధంగా బౌలింగ్ వేసి తమ బలహీనతలను వారు బయటపెట్టుకున్నారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, చాలా పేలవంగా బౌలింగ్ చేశారని అన్నారు. "ఈరోజు అన్నీ షార్ట్ బాల్స్ వేశారు. యార్కర్లు ఎక్కడికిపోయాయి? బౌలర్లలో నమ్మకం పోయినట్టు ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.