: ఢిల్లీలో 67.14 శాతం పోలింగ్ నమోదు... బారులు తీరిన మహిళలు, యువత!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిన్న సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. స్వల్ప ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో (65.86 శాతం) కంటే ఈ ఏడాది ఓట్లేసేందుకు ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం 67.14 శాతం పోలింగ్ నమోదైంది. గోకల్ పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 73.46 శాతం పోలింగ్ నమోదు కాగా, ఢిల్లీ కంటోన్మెంట్ లో అత్యల్పంగా 58.47 శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటలకు నిర్దేశిత సమయం ముగిసినా, ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలలో నిల్చున్న వారికందరికీ ఓటేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. బీజేపీ, ఆప్ లు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రధానంగా యువత, మహిళలు ఆసక్తి కనబరచారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ రెండు వర్గాలకు చెందిన ఓటర్లు బారులు తీరారు. అంతేకాక కొత్తగా ఓటర్లుగా నమోదైన యువత పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 673 మంది భవిష్యత్తు ఈ నెల 10న తేలనుంది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ నెల 10న జరగనున్న కౌంటింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.