: మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం కానీ... ప్రతిపక్షాలకు కాదు: కేటీఆర్
ప్రతిపక్షాలపై టీఎస్ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చేతనైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించండి... లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటుందని, ప్రతిపక్షాలకు కాదని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తోందని అన్నారు. గత ప్రభుత్వాల అస్తవ్యస్థ పాలనను గాడిలో పెడుతూనే, ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. బీడీ కార్మికులకు మార్చి నుంచి రూ. వెయ్యి భృతి చెల్లిస్తామని, త్వరలోనే సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ. 1500 కోట్లు కేటాయించామని తెలిపారు. విద్యుత్ సరఫరా చేయాలని ఏపీని అడగాలని టీడీపీ నేత ఎర్రబెల్లి అనడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. విభజన చట్టంలోని అంశాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అడుక్కోవడం తమకు రాదని, శాసించి తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చింత చచ్చినా పులుపు చావలేదని విమర్శించారు.