: 49 రోజుల ఆప్ పాలన ఓ పీడకల: అరుణ్ జైట్లీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తొలిసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి 49 రోజులు పాలించిన ఆప్ పై విరుచుకుపడ్డారు. ఆ పాలన ఓ పీడకలలాంటిదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, సచివాలయం కన్నా వీధుల్లోనే ఆప్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలకు సమర్థ నాయకత్వం కావాలని... అరాచకవాదులు అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని జైట్లీ కోరారు. అస్థిరత నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కలగాలన్న ఆయన, మంచి ఆధిక్యం సాధించి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని చెప్పారు.