: ధరలు అదుపు చేస్తానన్న మోదీ బాదేస్తున్నారా?
సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని, ప్రజలను అందలాలు ఎక్కిస్తామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అధికారం చేపట్టిన తరువాత తానిచ్చిన హామీల సంగతి మర్చిపోయినట్టున్నారు. పన్నులు విధిస్తూ, సబ్సిడీలు ఎత్తేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ అధికారం చేపట్టిన తరువాత, అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఏర్పడిన పోటీ కారణంగా చమురు ఉత్పత్తుల ధరలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర బాగా పడిపోయింది. దీంతో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఎన్నడూ లేనంత వేగంగా గత ఆరు నెలల్లో పది సార్లు తగ్గాయి. అయితే, చమురు ధరలపై నియంత్రణ ఎత్తి వేసిన కేంద్రం, ఎక్సైజ్ టాక్స్ విధించి విమర్శలకు తావిచ్చింది. దీంతో, రోజుకు సుమారు 4 వేల కోట్ల రూపాయల చొప్పున ఆదాయాన్ని వెనకేసుకుంది. స్మార్ట్ సిటీలంటూ, అభివృద్ధే తమ నినాదం అని ఊదరగొడుతున్న మోదీ సర్కారు... పేదల కడుపు కొట్టి పెద్దలకు పంచుతోందన్న విమర్శలను చవిచూస్తోంది. అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాం అంటూ భారీ రాయితీలు, వేల ఎకరాలను పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్న కేంద్రం, సాధారణ పౌరులపై టాక్స్ ల భారం పెంచుతూ ఇక్కట్లపాలు చేస్తోందన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ.