: పాక్ జట్టు ఇప్పటికీ డేంజరస్సే!
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ఆయా జట్ల బలాబలాలపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. టైటిల్ కోసం పోటీ పడుతున్న జట్లలో పాకిస్థాన్ ఇప్పటికీ ప్రమాదకరమైన జట్టేనని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ లో పాక్ విజేతగా నిలవడం తెలిసిందే. ఆనాటి చిరస్మరణీయ విజయం ప్రస్తుత జట్టును ఉత్తేజపరుస్తుందనడంలో సందేహంలేదు. మిస్బా-ఉల్-హక్ నాయకత్వంలోని పాక్ జట్టు ఈసారి కూడా రాణిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక, జట్టు విషయానికొస్తే... బ్యాటింగ్ లో మిస్బా, యూనిస్ ఖాన్, అహ్మద్ షేజాద్, ఉమర్ అక్మల్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా కనిపిస్తోంది. మిస్బా, యూనిస్ క్రీజులో కుదురుకున్నారంటే వారిని అవుట్ చేయడం అంత సులువు కాదు. చాపకింద నీరులా పని పూర్తిచేస్తారు. షేజాద్, ఉమర్ దూకుడుగా ఆడడంలో దిట్టలు. అన్ని రకాల షాట్లు వీరి అమ్ములపొదిలో ఉన్నాయి. బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే... జునైద్ ఖాన్ గాయంతో తప్పుకోవడం, సయీద్ అజ్మల్ గైర్హాజరీ నేపథ్యంలో కొంత కళ తప్పినట్టు కనిపిస్తున్నా, జట్టులో ఉన్న వహాబ్ రియాజ్, మహ్మద్ ఇర్ఫాన్ లను తక్కువగా అంచనా వేయలేం. పేస్ కు అనుకూలించే ఆసీస్, న్యూజిలాండ్ పిచ్ లపై వారు రాణిస్తే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు కష్టాలు తప్పవు. తన లెగ్ స్పిన్ తో కట్టిపడేసే అఫ్రిది ఉండనే ఉన్నాడు. అఫ్రిది బౌలింగ్ శైలికి పిచ్ లు అతికినట్టు సరిపోతాయన్నది విశ్లేషకుల మాట. టర్న్ రాబట్టే అఫ్రిది బౌన్సీ పిచ్ లపై బ్యాట్స్ మెన్ ను ఇరకాటంలో పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ టోర్నీ గ్రూపు దశను అధిగమిస్తే మాత్రం ప్రత్యర్థి జట్లకు ప్రమాద ఘంటికలు మోగినట్టే. నాకౌట్ పోటీల్లో చావోరేవో అన్నట్టు తేల్చుకుంటారని పాక్ ఆటగాళ్లకు పేరు. మరి తాజా ఈవెంట్ లో ఎలా ఆడతారో చూడాలి!