: గెలిచేందుకే వచ్చా... ఢిల్లీని తల్లిలా ప్రేమిస్తా: కిరణ్ బేడీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చరమాంకంలోకి ప్రవేశించింది. అభ్యర్థులు ఎవరికివారు గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు పాలనాధికారం దక్కబోతోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పేర్కొనగా, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కూడా విజయంపై గట్టినమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, గెలిచేందుకు వచ్చానని స్పష్టం చేశారు. విధి తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని, తనకు ఇతర ఉద్దేశాలేవీ లేవని, దేవుడు అన్నీ ఇచ్చాడని తెలిపారు. ఆత్మప్రబోధానుసారం ఢిల్లీ బరిలో దిగానని వెల్లడించారు. ఓడిపోవడానికి రాలేదని, తప్పక గెలుస్తానని ధీమాగా చెప్పారు. 14 ఏళ్ల వయసు నుంచి ఢిల్లీ నగరం తెలుసని, అమృత్ సర్ నుంచి ఇక్కడికి టెన్నిస్ మ్యాచ్ లు ఆడేందుకు వచ్చేదాన్నని వివరించారు. ఈ నగరానికి సేవ చేయాలని ఎప్పుడూ అనుకునేదాన్నని, దేవుడి దయ వల్ల ఇక్కడే తొలి పోస్టింగ్ లభించిందని వెల్లడించారు. ఢిల్లీని ఓ మాతృమూర్తిలా ప్రేమిస్తానని స్పష్టం చేశారు.